Posts

హరి చందనంబు మేనునఁగర మొప్పెడు హస్తినులను గంకణరవముల్

హరి చందనంబు మేనునఁ గర మొప్పెడు హస్తములను గంకణరవముల్ ఉరమున రత్నము మెఱయఁగ పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా! భగవంతుడు చిన్నతనంలోని అమాయకత్వం,తల్లితండ్రుల ప్రేమ ఆస్వాదించాలనుకున్నాడో,ఏమో?అందుకేనేమో కృష్ణావతారంలో తనివితీరా అనుభవించాడు.ఇక్కడ కవి కృష్ణుడి చిన్నతనపు ముద్దు ముచ్చటలు ప్రస్తావిస్తున్నాడు.బుజ్జి కృష్ఞుడు,బాల కృష్ణుడు ఒంటికి అంతా చందనం పూసుకొని వున్నాడట.తన బుల్లి,లేత చేతులకు కంకణాలు వేసుకుని వున్నాడట.మెడలోని దండకు రత్నం మెరిసి పోతుందట.కంకణాలు చెవులకు వినసొంపైన శబ్దాలు చేసేలా బంగారు కిట్టయ్య అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడట!సూర్యకిరణాలకు ఆ రత్నం మెరుస్తున్నదట!ఇదంతా చూడగలిగిన ఆ యశోద ఎంత అదృష్టవంతురాలో కదా!

అందెలు గజ్జెలు మ్రోయఁగఁ

అందెలు గజ్జెలు మ్రోయఁగఁ జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల ముఱియుచు కృష్ణా! కృష్ణుడి చిన్నతనం అంతా గోపాలకులతో,గోకులంలో గడిచింది.యశోద చాలా పుణ్యం చేసుకుంది.ఎందుకంటే,బాలగోపాలుడు అయిన కృష్ణుడు తన బుడి బుడి అడుగులతో,చిన్నతనపు చేష్టలతో ఆమె మనసు తనివితీరేలా చేసాడు.బుజ్జి కృష్ణుడు,తన పాదాలకున్న గజ్జెలు ఘల్లు ఘల్లు మంటుండగా ఇల్లూ వాకిలి అంతా సంతోషంతో చిందులు త్రొక్కుతున్నాడు.అతని అమాయకపు మాటలు,చేతలు,గెంతులు,ఆటలతో ఆ నందుని సతి అయిన యశోద తన్మయత్వం చెందుతుంది,మురిసి పొతుంది.ఇదంతా నీకే సాథ్యం కృష్ణా!

అల్ల జగన్నాథుకు రే

అల్ల జగన్నాథుకు రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయుఁ దల్లియునై చన్నుఁ గుడిపిఁ దనరగ కృష్ణా! కృష్ణుడు లోకాలన్నిటినీ పాలించే జగన్నాథుడు.అతనికి చిన్న వయసులో ఆడుకునేదానికి రేపల్లె క్రీడా స్థలం అయింది.యశోద కృష్ణుడిని పెంచిన తల్లి,ప్రేమ పంచిన తల్లి.ఆమె ఒక సామాన్యమయిన గొల్ల వనిత.ఆమెకు భగవంతుడికి చనుబాలు ఇచ్చే అదృష్టం దక్కింది.ఆ భగవంతుడు లీలా వినోదుడు కాబట్టే ఇవన్నీ అవలీలగా జరిగిపోయాయి.

అష్టమి రోహిణి ప్రొద్దున

అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్ దుష్టునిఁగంసు వధింపవె సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా! కృష్ణుడు రోహిణీ నక్షత్రం,అష్టమి తిథిలో పుట్టాడు.అందుకే మనం కృష్ణాష్టమి పండుగ చేసుకుంటాము ఆయన పుట్టిన రోజున.ఆయన దేవకీ గర్భంలో ఎనిమిదో సంతానంగా పుట్టాడు.చిన్న వయసులోనే దుష్టుడు అయిన తన మేనమామ,కంసుని వధించాడు.ఇది కక్షసాథింపు చర్యగా చెయ్యలేదు.లోక కల్యాణం కోసమే చేసాడు.ఈ సృష్టిని రక్షించే దాని కోసం చేసాడు.

పదునాలుగు భువనంబులు

పదునాలుగు భువనంబులు కుదురుగ నీ కుక్షి నిల్పుకొని నేర్పరివై విదితంబుగ నా దేవకి యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా! కవి కృష్ణుడిని చూసి ఆశ్చర్య పోతున్నాడు.ఎందుకంటే ఇందుకే.ఆయనే ఒక పరబ్రహ్మ అయి పదునాలుగు భువనభాండాలను తన కడుపులో దాచుకున్నాడు.అట్లాంటి ఆయన దేవకి అయిన తన తల్లి,ఒక సామాన్యమయిన మహిళ, ఉదరంలో ఎలా ఒదిగి వుండగలిగాడు అనేదే విడ్డూరమయిన,ఆశ్చర్యం కలిగించే విషయం.

వేదంబులు గననేరని

వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ!మురారీ! నా దిక్కుఁ జూచి కావుము నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా! హే కృష్ణా!ముర అనే రాక్షసుడిని చంపిన దుష్టశిక్షకుడివి.ఎలాంటి పాపములు అంటని వాడివి.వేదములు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాయి.ఆది అంతం,చావు పుట్టుకలు లేని పరబ్రహ్మమూర్తివి నీవు.నా దిక్కున చూసి,నన్ను కరుణించుము స్వామీ!నిజంగా నీవే నాకు దిక్కు అని మనసా,వాచా,కర్మణా నమ్మినాను.

ఓ కారుణ్య పయోనిధీ!

ఓ కారుణ్య పయోనిధీ! నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవన్। నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత!లోకనాయక!కృష్ణా! హే కృష్ణా!నీవు కరుణా సముద్రుడివి. నీవే నాకు గతివి,పతివి అని గట్టిగా నమ్ముకున్నాను.నన్ను రక్షించేదానికి నా పక్కన నువ్వుంటే ఇంక నాకు దిగులు,విచారం దేనికి?స్వర్గాధిపతి,దేవేంద్రుడు కూడా నిన్ను సదా కొనియాడుతుంటాడు.ముల్లోకాలకూ నాయకుడివి నీవు.అలాంటి నీ సంరక్షణలో వున్న నాకు భయం దేనికి?